pawan kalyan explains about cast equations in prajarajyam pary

ప్రజారాజ్యం విషయంలో అందుకే దెబ్బతిన్నాం

ఎట్టకేలకు పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీ వైఫల్యంపై పెదవి విప్పారు. సామాజిక న్యాయం అంటూ ఎన్నికలకు పోయి 2009లో దెబ్బతిన్నాం అని వాపోయారు. అమలాపురంలో చేనేతలతో ప్రత్యేక సమావేశంలో ఆయన తన మనసులో మాటబైటపెట్టారు. మీ (చేనేతలు) బాధ, వ్యథ, కష్టాలను చట్టసభల్లో ప్రతిబింబించేలా ప్రాతినిధ్యం ఉండాలి. జిల్లాలో మూడు స్థానాలను ఇవ్వాలని కోరుతున్నారు. కేవలం చట్టసభల్లో 2-3 సీట్లిస్తే చేనేతలకు న్యాయం జరగదు. చాలామంది కులనాయకులు చట్టసభలకు వెళ్లారు. వారు బాగుపడ్డారు కానీ కులాలు బాగుపడలేదు.

మేము కూడా సోషల్ జస్టిస్ పేరుతో 2009లో ఇలా చేసే దెబ్బతిన్నాం. అనుకున్న ఆశయాలు నెరవేర్చలేకపోయాం. చేసిన దానికి ఎవరూ మా వెంట నిలబడలేదు. చేనేతలకు ఎన్ని సీట్లు ఇస్తాం అనేదానికంటే మీకు అండగా ఉంటాను. గెలవగలిగే సామర్థ్యం ఉంటే కచ్చితంగా సీటు ఇస్తాను. కుదరని పక్షంలో నామినేటెడ్ పోస్టులు ఇస్తాము. సోషల్ జస్టిస్ పేరుతో సామాజిక వర్గాలన్నిటికీ టికెట్లు ఇచ్చుకుంటూపోయి చివరకు ప్రజారాజ్యం పార్టీ దెబ్బతింది అనిచెప్పారు. అనుకున్న ఆశయాలు నెరవేర్చలేకపోవడానికి కారణం అదేనన్నారు. ఒక రకంగా చిరంజీవి నేర్పిన రాజకీయ పాఠాలే పవన్ మైండ్ సెట్ ని మార్చాయి.

సామాజిక వర్గాల వారీగా, గతంలో ప్రజారాజ్యం పార్టీ టికెట్లు కేటాయించింది. కొన్నిచోట్ల గెలవగలిగే సామర్థ్యం లేదని తెలినా కూడా కులాల లెక్కలు వేసుకుని అందరినీ సంతృప్తి పరిచింది. కానీ చివరికి అదే వ్యూహం పార్టీని నిండా ముంచింది. అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ అదే సూత్రాన్ని బేస్ చేసుకుని అధికారంలోకి రావడం మాత్రం అసాధ్యం. అందుకే పవన్ కల్యాణ్ ముందుగానే మేల్కొన్నారు. తనతో సమావేశమయ్యే కులసంఘాలతో టికెట్ల కేటాయింపుపై జాగ్రత్తగా మాట్లాడుతున్నారు, ఎవరికీ హామీలివ్వడంలేదు. ఇప్పుడు మాటిచ్చేసి, ఆ తర్వాత బలమైన అభ్యర్థి దొరికితే చేసేదేమీ లేదు కాబట్టి.. వ్యూహాత్మకంగానే అడుగులేస్తున్నారు. ఈ విషయంలో అన్నకు ఎదురైన చేదు అనుభవాలే తమ్ముడికి శ్రీరామరక్ష.

Tags: pawan kalyan, explains, about, caste equations, prajarajyam party