ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకపోవడం దారుణం.. వైసీపీకి చురకలు

రాజకీయాల్లో మార్పులు తీసుకురాగలిగే శక్తి ప్రజలకే ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నాయకులను ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ నేతలు నిసిగ్గుగా పార్టీలు ఫిరాయిస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధోరణి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లాలోని సర్ణభారత్ ట్రస్టులో వేర్వేరు రంగాలు ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో ఈరోజు వెంకయ్య అల్పాహార సమావేశం నిర్వహించారు.

పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్లు అలసత్వం వహించడం సరికాదని వెంకయ్య అన్నారు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు సభలకు వెళ్లకపోవడం దారుణమని పరోక్షంగా వైసీపీ నేతలను ప్రస్తావించారు. ఎన్నికల నేపథ్యంలో నేతలు ఇస్తున్న హామీలు చూస్తుంటే దిమ్మతిరుగుతోందని వ్యాఖ్యానించారు.

ఇలాంటి హామీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆర్థిక నేరగాళ్లు దేశం దాటకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఎన్నికల్లో కులం, మతం, ధనం ప్రభావం లేకుండా కేవలం అభ్యర్థి గుణం, సామర్థ్యం ఆధారంగా ఓటు వేయాలని వెంకయ్య తెలిపారు. అభివృద్ధి ఫలాలు దేశంలో అందరికి చేరాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
Tags: venkaiah naidu, vice president,ysrcp party