ముగ్గురు మోదీలు ఒక్కటై ఏపీపై కుట్ర చేస్తున్నారు: చంద్రబాబు

పార్లమెంటు సీట్లపైనే బాబు గురి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అసెంబ్లీ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకమో… పార్లమెంటు ఎన్నికలుకూడా అంతే కీలకమైనవి. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే… జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్రను పోషించాలనుకుంటున్న చంద్రబాబుకు లోక్ సభ ఎన్నికలు కూడా అంతే ముఖ్యం. ఏపీలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటేనే హస్తిన చంద్రబాబువైపు మిగిలిన పార్టీలు చూసే అవకాశముంది. లేకుంటే హస్తినలో పలుకరించే వారు కూడా ఉండని పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్నా, విభజన హామీలను నెరవేర్చుకోవాలన్నా ఒక్క అసెంబ్లీ మాత్రమే కాకుండా పార్లమెంటు ఎన్నికలు కూడా చంద్రబాబుకు ఈసారి కఠిన పరీక్ష పెట్టనున్నాయి. చంద్రబాబు ఈసారి పార్లమెంటు స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 పార్లమెంటు స్థానాల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో తన క్రేజ్ ను కాపాడుకునే జాగ్రత్తలు చంద్రబాబునాయుడు ఇప్పటి నుంచే తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి 15 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు దక్కాయి. బీజేపీ రెండు స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి బీజేపీ పరిస్థితి బాగాలేదు. తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉండటంలో కొంత వ్యతిరేకత ఉంది. సర్వేలు జగన్ పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. దీంతో చంద్రబాబు ఎంపీ స్థానాలపైన ఎక్కువగా దృష్టి పెట్టారు.25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక, అంగబలం ఉన్నవారికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సిట్టింగ్ లలో చాలామందికి ఈసారి టిక్కెట్లు ఇవ్వకూడదని బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ల్లోనూ కొందరు శాసనసభకు వెళతామని వారంతట వారే ముందుకు వస్తుండటంతో చంద్రబాబు పని సులువయింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అనంతపురం నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి మురళీమోహన్, విజయవాడకు కేశినేని నాని, నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు పేర్లు దాదాపు గా ఖరారయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అరకు ఎంపీ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసిన గుమ్మడి సంధ్యారాణి లేదా కిడారి శ్రావణ్ కుమార్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.విశాఖ ఎంపీ స్థానానికి త్వరలో పార్టీలో చేరబోయే సబ్బం హరి లేదా ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనకాపల్లి పార్లమెంటు స్థానానికి పార్టీలో చేరితే కొణతాల రామకృష్ణ లేదా అయ్యన్న పాత్రుడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాకినాడ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తను రంగంలోకి దించాలనుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుత ఎంపీ తోట నరసింహం ఎమ్మెల్యేగా వెళదామని భావిస్తున్నారు. అమలాపురం నుంచి గొల్లపల్లి సూర్యారావు, ఏలూరు నుంచి బోళ్ల రాజీవ్ లను బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో సర్వేలు చేయిస్తున్నారు. బందరు అభ్యర్థిని కూడా మార్చే అవకాశముంది. కొనకళ్ల నారాయణకు అసెంబ్లీ ఛాన్స్ దక్కుతుంది. బాపట్ల ప్రస్తుత ఎంపీ మాల్యాద్రి పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు ఆయన స్థానంలో పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన దేవీప్రసాద్ పేరును పరిశీలిస్తున్నారు. నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావుపోటీ చేయకుంటే మంత్రి శిద్దారాఘవరావునుపోటీకి దింపాలన్న యోచనలో ఉన్నారు. తిరుపతినుంచి వర్ల రామయ్య పేరు విన్పిస్తుంది. కడప లోక్ సభ నుంచి రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలలో ఒకరికి అభ్యర్థిత్వాన్ని ఇవ్వాలని చంద్రబాబు డిసైడయ్యారని చెబుతున్నారు. మొత్తం మీద ఎంపీ అభ్యర్థుల విషయంలో చంద్రబాబు భారీ కసరత్తు చేస్తున్నారు. ఈ అభ్యర్థుల ఎంపికలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.