దీపావళికి భగీరథ

పంద్రాగస్టు నాటికి అన్ని ఊళ్లకు.. దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్ఛమైన మంచినీళ్లను అందించడానికి తుది ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకంలో ఇప్పటికే అత్యధిక భాగం పనులు పూర్తయ్యాయని, పూర్తయిన పనుల్లో బాలారిష్టాలను అధిగమించడంతోపాటు మిగిలిన కొద్దిపాటి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని స్పష్టంచేశారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధిచేసిన నీటిని ఎలాంటి ఆటంకాల్లేకుండా సరఫరా చేయాలని సీఎం అధికారులను కోరారు. పనులన్నీ తుది దశకు చేరుకొన్న నేపథ్యంలో ఇప్పటివరకూ నిర్మించిన ఇంటేక్ వెల్స్, వాటర్
ప్లాంట్లు.. ఓహెచ్‌ఎస్‌ఆర్, ఓహెచ్‌బీఆర్, డిస్ట్రిబ్యూటరీ పైప్‌లైన్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లంటినీ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.

పనుల్లో అనుకున్నంత వేగంలేని ప్రాంతాల్లో స్వయంగా మిషన్ భగీరథ వైస్‌చైర్మన్, సెక్రటరీ, ఈఎన్సీ స్వయంగా పర్యటించి ఇబ్బందులను పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతి, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి నేరుగా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, అధికారులు, వర్క్ ఏజెన్సీలతో మాట్లాడి అప్రమత్తం చేశారు. పది జిల్లాల్లో పనులు వందకు వంద శాతం పూర్తవుతున్న నేపథ్యంలో.. కొద్ది రోజుల్లోనే ఆయా జిల్లాల్లో పథకాన్ని ప్రారంభించాలని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జే సంతోష్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, మిషన్ భగీరథ సలహాదారు జ్ఞానేశ్వర్, మనోహర్, సీఈ విజయ ప్రకాష్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, కనకయ్య, ఎమ్మెల్సీ సలీం పాల్గొన్నారు.

ద్రాగస్టున 799 ప్రాంతాల్లో కంటివెలుగు
ఆగస్టు 15న మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా 799 చోట్ల కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గంలో తాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని, ప్రతీ కేంద్రంలో కూడా కచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి పాల్గొనేలా ఏర్పాట్లుచేయాలని సూచించారు. కంటి పరీక్షలు చేయడానికి అవసరమైన సిబ్బంది, పరికరాలు, మందులు, అద్దాలను కూడా గ్రామాలకు చేర్చాలని స్పష్టంచేశారు.
Tags:Mission Bhagiratha, CM KCR , Pragathi Bhava , Diwali , Drinking Water

One comment

Leave a Reply