తెలంగాణ టీఆర్‌ఎస్‌దే

తెలంగాణ టీఆర్‌ఎస్‌దే

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతారని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ సర్వే తేల్చి చెప్పింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ 16 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టంచేసింది. డిసెంబర్ 15-25 తేదీల మధ్య దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే వివరాలను తాజాగా విడుదలచేసింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజలు మరోసారి సీఎం కేసీఆర్ వెన్నంటే ఉంటారని తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 19 స్థానాల్లో విజయం సాధిస్తుందని, టీడీపీ నాలుగు స్థానాలకే పరిమితం అవుతుందని సర్వే వెల్లడించింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. మెజార్టీకి 15 స్థానాల దూరంలో నిలిచిపోతుందని పేర్కొన్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్‌లో సగం సీట్లు మాత్రమే వస్తాయని, కాంగ్రెస్‌కు ఈసారి కూడా అధికారం అందని ద్రాక్షేనని స్పష్టంచేసింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో ఈసారి ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారుతాయని తేల్చింది. దేశవ్యాప్తంగా 543 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. 272 సీట్లు గెలుచుకున్న పార్టీ లేదా కూటమి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది.

అప్పుడూ.. ఇప్పుడూ టీఆర్‌ఎస్సే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియాటీవీ-సీఎన్‌ఎక్స్ చేసిన సర్వేలో ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని తేలింది. టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తేల్చిచెప్పింది. నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వినూత్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, మళ్లీ కేసీఆర్‌కే పట్టం కడుతారని పేర్కొన్నది. ఈ అంచనాలు నిజమయ్యాయి. టీఆర్‌ఎస్ పార్టీ 88 సీట్లు గెలుచుకొని రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు ఖాయమని ఇండియాటీవీ-సీఎన్‌ఎక్స్ సర్వే చెప్తున్నది. మరోవైపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయని సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగుతుందని, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన సీన్
ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ కలిసి ఇటీవలి ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత దేశం మొత్తం సర్వే నిర్వహించింది. ఎన్నికలకు ముందు గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన ఎన్డీయేకు 281 సీట్లు వస్తాయని, సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందని అంచనావేసింది. యూపీఏకు 124 సీట్లు వస్తాయని తెలిపింది. కానీ.. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించిన సర్వేలో ఎన్డీయే బలం తగ్గిపోయిందని నివేదిక వెల్లడించింది. తాజాగా డిసెంబర్ 15-25 మధ్య సర్వే నిర్వహిచింది. దేశవ్యాప్తంగా 543 పార్లమెంటరీ స్థానాల్లో 18-60 ఏండ్ల మధ్య వయసున్న 54,300 మందిని సర్వే చేశారు. ఇందులో వివిధ వర్గాలకు చెందిన 27,832 మంది పురుషులు, 26,408 మంది స్త్రీలు ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో 17 సీట్లకుగానూ 16 సీట్లు టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎన్డీఏ కూటమికి 257 సీట్లు వస్తాయని, ఇందులో బీజేపీ 223 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 146 సీట్లకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్ 85 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొన్నది. మిగతా పార్టీలు 140 సీట్లు గెలుచుకుంటాయని తెలిపింది. రెండు ప్రధాన కూటములు మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోలేవని, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఈసారి ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయని సర్వే వెల్లడించింది.