జీతం చాలట్లేదట… బురఖాతో వెళ్లి నగలు కాజేస్తున్న బ్యూటీషియన్ అరెస్ట్!

  • ఇప్పటికే పలు కేసులు నమోదు
  • తాజాగా ఖజానా జ్యూవెలరీలో దొంగతనం
  • సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలించి పట్టేసిన పోలీసులు

గత కొంతకాలంగా హైదరాబాద్ లో బురఖా వేషంతో జ్యూవెలరీ షాపుల్లోకి వెళ్లి, అక్కడున్న వారిని మాటల్లో పెట్టి ఖరీదైన నగలను కాజేస్తున్న యువతి ఆటను హైదరాబాద్ పోలీసులు కట్టించారు. ఆమెపై వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, కేసును సీరియస్ గా తీసుకున్న రాచకొండ పోలీసులు, సీసీటీవీ కెమెరాల ఆధారంతో ఆమెను గుర్తించి, నిన్న చైతన్యపురి ప్రాంతంలో అరెస్ట్ చేశారు.

మూసాపేటలో ఆమె నివాసం ఉంటుందని, ఆమె పేరు రేఖ (29) అని వెల్లడించిన పోలీసులు, విలాసాలకు అలవాటు పడిన ఆమె, తనకు వచ్చే జీతం సరిపోక, ఈ పాడు పనులకు పాల్పడిందని తెలిపారు. ఆమెపై పంజాగుట్టలో రెండు, సరూర్ నగర్ లో రెండు కేసులు ఇప్పటికే నమోదయ్యాయని, 22వ తేదీన చైతన్యపురిలోని ఖజానా జ్యూవెలరీ షాపులో సిబ్బంది దృష్టిని మళ్లించి నగలు కొట్టేసిన కేసులో అరెస్ట్ చేశామని తెలిపారు. ఆమె నుంచి రూ. 4.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.