చంద్రబాబు నాయకుడు కాదు.. మీడియా మేనేజర్: కేసీఆర్

చంద్రబాబు నాయకుడు కాదు.. మీడియా మేనేజర్: కేసీఆర్

ఇండియా టుడే రిపోర్టర్ రాజ్ దీప్ సర్దేశాయ్.. సీఎం కేసీఆర్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉండగానే.. ప్రచారానికి హెలికాప్టర్ లో వెళ్తున్న సమయంలోనే ఓ పది నిమిషాల పాటు సీఎం కేసీఆర్ తో తెలంగాణ ఎన్నికల గురించి రాజ్ దీప్ మాట్లాడాడు. ఈ సందర్భంగా రాజ్ దీప్ సీఎం కేసీఆర్ ను కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగాడు.
1. గులాబి రంగును మీరు ఎందుకు ఇష్టపడతారు?
ఇది పార్టీ కలర్ కాబట్టి.. గులాబి కలర్ ఇష్టమని సీఎం సమాధానమిచ్చారు.

2. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని అంటున్న ప్రతిప‌క్షాల విమర్శలపై ఏమంటారు?
ఇది విలాసవంతమైన ఫామ్ హౌస్ కాదు… ఇది మా తోట మాత్రమేనని వెల్లడించారు. మొదటి నుంచి తాను వ్యవసాయదారుడినని తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు.

3. వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువ గడుపుతారు… సెక్రటియేట్‌కు రాని ముఖ్యమంత్రి అని ప్రతిపక్షాల విమర్శలకు మీరేమంటారు?
ప్రజల పాలన కోసం ఎంత సమయం కేటాయించమన్నది ముఖ్యం కాదని… ప్రజల కోసం చేసే పని మనస్పూర్తిగా చేస్తున్నామని లేదా అన్నది ముఖ్యమని తెలిపారు. నాలుగున్నర ఏండ్ల తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు అందాల్సిన ఫలాలు అందాయని… రాబోయే కాలంలో కూడా ప్రజలు తమపై విశ్వసం ఉంచి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ టర్మ్‌లో మిగితా పనులు పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు సంపూర్ణ సేవ చేసుకున్నామని సంతృప్తి చెందుతామన్నారు.

4.ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారు..?
ఈ ఎన్నికలు పూర్తి చేసుకుని జాతీయ రాజకీయలపై దృష్టి పెట్టడానికి, దేశం కోసం ఏదైనా చేయడానికి, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి దేశ రాజకీయాలను విముక్తి కల్పించాలని భావిస్తున్నామన్నారు. ప్రజలకు ఉపయోగం లేని ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుని ఎన్నికల్లో గెలుస్తూ పబ్బం గడుపుతున్నాయని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ తెలంగాణలో మీటింగ్ పెట్టి టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీ తొత్తుగా అభివర్ణిస్తారు. మోడి కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ తొత్తునంటాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటూ… దేశ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలతో పొత్తుపెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. గతంలో తెలంగాణ సాధించడం కోసం అందరితో పొత్తుపెట్టుకుని, అన్ని పార్టీలతో జై తెలంగాణ అనిపించామన్నారు. దేశంలోని 42 పార్టీల నాయకులను కలిసి వారి మద్దతు కోరి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు.

చంద్రబాబు నాయుడు ఒక చెత్తా రాజకీయ నాయకుడు. అతను లీడర్ కాదని మీడియా మేనేజర్ అని విమర్శించారు. గత నాలుగేండ్లుగా బీజేపీతో పనితో కలిపి పనిచేసిన చంద్రబాబు, అప్పుడు కాంగ్రెస్‌ను తిట్టి ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే ప్రజలు చూస్తు ఊరుకోరని తెలిపారు. బీజేపీ, మోడీ ప్రభావం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితితో పోటీకి చాలా దూరంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలలో బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూస్తారన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన రోజు నేను ఒక్కడినే ఉన్నాను. అనంతరం తెలంగాణ ప్రజానికం మొత్తం నా వెంట నడిచింది. 17 మందిగా ఉన్న తెలంగాణ ఎంపీలే… దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నారు. ఉద్యమం ఒక్కడితోనే ప్రారంభమై, దేశమంతటా విస్తరిస్తుందన్నారు. ప్రజలందరూ ఒక్కటైతే రాజకీయ పార్టీలన్నీ వారి వెంట నడవాల్సి ఉంటుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రధాన మంత్రి పదవి కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం లేదని రాష్ర్టాలకు కొత్త ఆర్థిక విధానం కోసం కొట్లాడటానికేనన్నారు. డిసెంబర్ 11వ తేదీ తరువాత ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాను ప్రకటిస్తామని పేర్కొన్నారు.