చంద్రబాబు చేసిన ద్రోహాన్ని గుర్తుంచుకుని మరీ ప్రజలు ఓటేశారు!: వైసీపీ నేత కోలగట్ల

ఈవీఎంల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యానుకు పడుతుందని సీఎం చంద్రబాబు చెప్పడంపై వైసీపీ నేత, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేసారు.  విజయనగరంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు రాకముందే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఈసారి టీడీపీకి 130 అసెంబ్లీ సీట్లు వస్తాయని చంద్రబాబు ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు.  తొలుత ఈసీని బెదిరించిన చంద్రబాబు, అది ఫలితం ఇవ్వకపోవడంతో ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తున్నారని  దుయ్యబట్టారు.  గెలుపోటములు  హుందాగా స్వీకరించాల్సింది పోయి ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు తప్పుపట్టం సరికాదని హితవు పలికారు. జైలుకు పోవాల్సి వస్తుందన్న భయంతోనే చంద్రబాబు వేర్వేరు పార్టీల నేతలతో కలుస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన నమ్మక ద్రోహాన్ని ఏపీ ప్రజలు గుర్తుంచుకుని మరీ ఓటేశారని వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం తథ్యమన్నారు. విజయనగరంలో నీటికొరత తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply