గుండెజబ్బుల్ని పసిగట్టే యాపిల్‌ వాచ్‌లు!

  • హార్ట్‌ బీట్‌ను పసిగట్టే ప్రత్యేక యాప్‌ అమరిక
  • అనుమానం వచ్చినప్పుడు ఈసీజీ చెక్‌ చేసుకోవచ్చు
  • పీడీఎఫ్‌ వివరాలు డాక్టర్‌కు షేర్‌ చేసే సదుపాయం

గుండె జబ్బులను పసిగట్టే వాచ్‌ను యాపిల్‌ సంస్థ విడుదల చేసింది. వాచ్‌ సీరిస్‌ 4లో భాగంగా వీటిని రూపొందించింది. ఈ వాచ్‌లు గడచిన మూడు సీరిస్‌ల్లోని వాచ్‌ల కన్నా 30 శాతం పెద్దవిగా ఉంటాయి. 50 శాతం అదనపు సౌండ్‌ను ప్రొడ్యూస్‌ చేస్తాయి. ఈ వాచ్‌లో అధునాతన ఎస్‌4 చిప్‌ను, 64 బిట్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ను అమర్చారు.

వాచ్‌లో అమర్చిన ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌ వల్ల యూజర్లు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈసీజీ యాప్‌ ద్వారా తన గుండె పనితీరును పరిశీలించుకోవచ్చు. దీనివల్ల గుండె పోటు వచ్చే అవకాశాలను పసిగట్టవచ్చు. పల్స్‌రేట్‌, ఇతర అంశాల ఆధారంగా గుండె పనితీరుపై ఈ యాప్‌ నివేదిక ఇస్తుంది. ఈ వివరాలను పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌ రూపంలో యాపిల్‌ వాచ్‌ స్టోర్‌ చేస్తుంది. అవసరమనుకుంటే ఆ డాక్యుమెంట్‌ను డాక్టర్‌కు షేర్‌ చేయవచ్చు.