ఎన్‌ఐఏకు కోడికత్తి కేసు: హైకోర్టు ఉత్తర్వులు

 

 

విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్‌పై కోడి కత్తితో జరిగిన దాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది.

జగన్‌పై గతేడాది అక్టోబర్‌ 25న జరిగిన దాడి కేసుపై కొందరు వైకాపా నేతలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. జగన్‌పై దాడి కేసులో రాష్ట్ర ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయలేదని, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని జగన్‌ తరఫు న్యాయవాదులు కోరారు. కేసు విచారణ ఆలస్యమైతే న్యాయం జరగదని వాదనలు వినిపించారు. దాడి జరిగిన ప్రదేశం (విమానాశ్రయం లాంజ్‌) కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది కాబట్టి జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని భావించిన ధర్మాసనం.. కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేసి నిందితుడిని విచారించిందని, పూర్తి స్థాయిలో కేసు విచారణ జరిగిందని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయినా కేసును ఎన్‌ఐఏకు అప్పగించేందుకే ధర్మాసనం మొగ్గు చూపింది.

తీర్పునకు ముందే ఎన్‌ఐఏకు మార్గదర్శకాలు!

దాడి కేసును ఎన్‌ఐఏకు హైకోర్టు అప్పగిస్తూ తీర్పు వెలువరించకముందే కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో ఎన్‌ఐఏకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల ఒకటో తేదీ సాయంత్రమే ఎన్‌ఐఏ హైదరాబాద్‌ విభాగం ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాడెంట్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన విషయాన్ని ఏపీ హైకోర్టుకు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.