ఎక్కడ ఎలా మాట్లాడాలి ?: వాల్మీకి రామాయణం

వాల్మీకి రామాయణంలో హనుమ –

సందర్భ శుద్ధి అని ఈ రోజుల్లో అసందర్భమయిన మాట ఒకటి . ఎక్కడ , ఎవరితో , ఏమి , ఎలా , ఎందుకు మాట్లాడుతున్నామో స్పృహ కలిగి ఉండడం చాలా అవసరం . రామాయణమంతా వేద సారం , మంత్రమయం .అందులో సుందరకాండ మరీ ప్రత్యేకం .

హనుమ నవ వ్యాకరణ పండితుడు . సూర్యుడి దగ్గర శిష్యరికం చేసినవాడు . తపస్వి . సుగ్రీవుడి మంత్రి . భక్తుడు . సేవకుడు . రాయబారి . కార్యసాధకుడు . యోధుడు . పరాక్రమశాలి . అన్నిటికీ మించి వినయ సంపన్నుడు . గొప్ప వాక్కు అలంకారంగా కలిగినవాడు – వాగ్విదాం వరం – అని వాల్మీకి పొంగిపోయాడు .

పదినెలల అశోకవనవాసం సీతమ్మను ఎంత కుంగదీసిందంటే – హనుమ రావడం రెండు నిముషాలు ఆలస్యమయితే ఆత్మహత్య చేసుకునేది . అలాంటి సంక్షుభిత ఉద్విగ్న సమయాల్లో హనుమ మాట్లాడిన తీరు అనన్యసామాన్యం . బహుశా అలా మాట్లాడాలంటే దేవుడే దిగి రావాలి .

తెల్లవారాక ముందే రావణుడు వచ్చి నానా మాటలు అని వెళ్ళాడు . పక్కనే నరమాంస భక్షకులయిన ఆడ రాక్షసుల గుండెలు గుచ్చుకునే మాటలు మరో వైపు .

ఇంతదాకా సంస్కృతంలో రావణుడు అఘోరించి వెళ్ళాడు – కాబట్టి సంస్కృతంలో మాట్లాడితే మళ్ళీ రావణుడి మాయలే అనుకుంటుంది . అనేక భాషలు తెలిసినవాడే భాష ఎంపిక గురించి ఆలోచించగలడు . సీతమ్మ ఊరు మిథిలా నగరవాసులు అయోధ్యలో మాట్లాడే ప్రాకృత అవధి భాషలో వారి యాసతోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు . అంటే సీతమ్మ మెట్టినింటి భాష నేర్చుకుంది . కానీ మిథిల యాస పోలేదు . ఎంత గొప్ప విషయం ? ఒకరకంగా తమిళనాడులో తెలుగు మాట్లాడినట్లు అనుకోవచ్చు . పూర్తిగా మన ఊరివారెవరో మాట్లాడుతున్నారని మొదటి మాటకే ఆమె ఉపశమనం పొందాలి . ఆతరువాత ఏమి చెబితే ఆమె ఇంకా నమ్ముతుంది ? శాంతిస్తుంది ? రామకథనే ఎంచుకున్నాడు . అంతే తన మాండలికంలో రామకథను వినగానే సీతమ్మకు పోయిన ప్రాణం తిరిగివచ్చింది .

క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమం అడగమన్నాడు – అన్నాడు హనుమ . అంటే ఆమె అడగకుండానే రాముడు క్షేమంగా ఉన్నాడని , ఆయనే తనను పంపాడని విన్నవించాడు . నువ్వెక్కడున్నావో తెలిసింది ఇక వెంటనే రాముడు వస్తాడు – అని అభయమిచ్చాడు .

ఏమో నువ్వంటే రాగలిగావు కానీ , ఇంత దూరం , ఇంత దుర్భేద్యమయిన లంక – అని సీతమ్మ నిట్టూరుస్తుంది .
తల్లీ పోస్టు మ్యాన్ పనికి అందరిలోకి చిన్నవాడిని , ఏమీ చేతగానివాడిని ఎంపిక చేస్తారు . అలా నన్ను నీ దగ్గరికి పంపారు . మా సుగ్రీవుడి దగ్గర అందరూ నాకంటే గొప్పవారు , నాతో సమానులే ఉన్నారు తల్లీ – సందేహించకు అని వినయంగా వివరణ ఇచ్చాడు . ఆపై రాముడి ఉంగరమిచ్చాడు . ఆమె శిరసు మాణిక్యం తీసుకున్నాడు . మిగిలిన కథ తెలిసిందే .
———-

హనుమ స్థానంలో మనం ఉంటే – అవునమ్మా రాముడు సుగ్రీవులకు చేతకాక నన్ను పంపారు . అబ్బో ఎంత శ్రమ పడ్డానో నిన్ను కనుక్కోవడానికి , అలసిపోయాను ఒక గ్లాసు కాఫీ ఇవ్వు తల్లీ అర్జంటుగా – అంటాం .
గోష్పదీ కృత వారాశిమ్ – వంద యోజనాలు దాటాక ఆవు కాలి గిట్ట చేసిన చిన్న గుంత దాటినంత సునాయాసంగా ఉన్నాడు హనుమ . కనీసం ఆయన నుదిటి మీద చెమట బిందువు కూడా లేదన్నాడు వాల్మీకి . ఎందుకంటే యథావినిర్ముక్తస్య రాఘవ – అంటూ రాముడు వదిలిన బాణంలా నేను లంకకు వెళుతున్నాను అనుకున్నాడు హనుమ . బాణం బాగా వేశారు అంటారు కానీ , బాణం బాగా పడింది అని ఎవరూ అనరు .

వినయం విజ్ఞానం –
అవినయం అంధకారం , అహంకారం .

శుభోదయం
-పమిడికాల్వ

Leave a Reply