ఎకరాకు 4 వేలు లక్ష వడ్డీలేని రుణం

ఎకరాకు 4 వేలు లక్ష వడ్డీలేని రుణం

తెలంగాణలో అన్నదాతల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నది. రాష్ట్రంలో ప్రతి రైతుకు ఎకరాకు ఏటా రూ.10 వేల చొప్పున పంట పెట్టుబడిని అందజేస్తున్న రైతుబంధు పథకాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని రైతులకు ఒక్కో సీజన్‌లో రూ.4 వేల చొప్పున ఇచ్చేందుకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాన్ని ప్రారంభించడంతోపాటు అన్నదాతలకు వడ్డీ లేకుం డా లక్ష రూపాయల వరకు రుణాలను అందజేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయని బిజినెస్ టుడే పత్రిక పేర్కొన్నది.

ఈ రెండు పథకాలకు సాలీనా రూ.2.3 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ పథకాలను అమలు చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఎరువులపై రైతులకు ఇస్తున్న రూ.70 వేలకోట్ల సబ్సిడీని వీటిలో విలీనం చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోదీ ప్రభుత్వం ఈ వారంలోనే రెండు పథకాలను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటనను ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని కార్యాలయంతోపాటు నీతి ఆయోగ్‌లో అత్యవసర సమావేశాలను నిర్వహించనున్నది. సంబంధిత శాఖలకు చెందిన అధికారులు సమావేశమై ఈ పథకాల అమలులో అవరోధాలు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం కోరింది. అలాగే ఈ పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించేందుకు ప్రధాని మోదీ రైతు సంఘాల నాయకులతో సమావేశం కానున్నారు.