ఈఫిల్ టవర్ మాదిరిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయసంకల్ప స్థూపవ

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర కు గుర్తుగా రూపొందించిన విజయసంకల్ప స్థూపం (పైలాన్‌) అత్యద్భుతంగా, ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. ఇచ్ఛాపురం బైపాస్‌ వద్ద బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన ఈ స్థూపం ఎప్పటికీ దర్శనీయ స్థలంగా ఉండేలా తీర్చిదిద్దారు. జగన్ 341 రోజుల పాదయాత్ర పూర్తి చేయనున్న వైఎస్‌ జగన్‌ 91 అడుగుల ఎత్తైన ఈ స్థూపాన్ని ఆవిష్కరించారు. ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ను తలపిస్తూ నాలుగు ఉక్కు స్తంభాలు కింది నుంచి విడిగా పైకి వెళ్లి పైన నాలుగూ కలిసేలా ఏర్పాటు చేసిన పైలాన్‌ కనులకు విందు చేస్తోంది. స్థూపం పై భాగాన పార్లమెంటు తరహాలో వృత్తాకారంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా రంగులతో కూడిన ఒక టూంబ్‌ను ఏర్పాటు చేశారు. దానిపైన పది అడుగుల ఎత్తులో పార్టీ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.టూంబ్‌కు దిగువున నాలుగు దిక్కుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలను ఏర్పాటు చేశారు. ఆ దిగువన పాదయాత్రికుడు వైఎస్‌ జగన్‌ నడిచి వస్తున్న నిలువెత్తు చిత్రాలను ఉంచారు. పైలాన్‌ లోపలి భాగంలో చుట్టూ జగన్‌ తన పాదయాత్రలో ప్రజలను కలుసుకుంటూ వచ్చిన ఫొటోలను ఏర్పాటు చేశారు.

స్థూపం బేస్‌మెంట్‌ పైకి ఎక్కేందుకు 13 మెట్లను ఏర్పాటు చేశారు. పాదయాత్రగా జగన్‌ నడచి వచ్చిన 13 జిల్లాల పేర్లను కింది నుంచి పైకి మెట్లపైన ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దాకా జగన్‌ నడిచిన రూట్‌ మ్యాపును కూడా నిక్షిప్తం చేశారు. దిగువున చుట్టూ ఒక చిన్నపాటి లాన్‌ ఏర్పాటు చేశారు. ఇందులోనే ఓ స్తంభం పక్కనే స్థూపం ఆవిష్కరణకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇక బయట చుట్టూ ప్రహరీ గోడపై ఓ వైపు ప్రజాసంకల్ప పాదయాత్ర 2017–2019 అని, మరోవైపు విజయసంకల్ప స్థూపం అని రాశారు.ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందు, శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో… ఏర్పాటైన ఈ పైలాన్‌ అందరినీ ఆకర్షిస్తోంది. 16వ నంబరు జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న పటిష్టమైన ఈ నిర్మాణానికి మరోవైపు హౌరా–చెన్నై రైల్వే లైను ఉంది. దీంతో అటు బస్సుల్లో , ఇటు రైళ్లలో ప్రయాణించే వారికి స్థూపం కనువిందు చేయనుంది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి ఇప్పటికే దర్శనీయ స్థలంగా మారింది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ విజయసంకల్ప స్థూపం కూడా అదే స్థాయిలో చరిత్రలో నిలవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.