ఆంధ్రాలో కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీకి పొత్తు లేదట !

 

కాంగ్రెస్‌తో తెలుగుదేశానికి పొత్తు లేదంటూ తేలిపోయింది. ఆంధ్ర కాంగ్రెస్ – టీడీపీ లీడర్లు ఊపిరి పీల్చుకున్నారు. సీనియర్ నాయకుల వ్యవహారశైలి ఎలా ఉన్నప్పటికీ… క్షేత్రస్థాయిలో 35 సంవత్సరాలుగా ఎడమొఖం పెడమొఖంతో ఉన్న రెండు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్ ఇప్పుడు పొత్తులు లేవని తేలిపోయిన తరువాత ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చని డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి బలం చేకూర్చడానికి పడుతున్న ప్రయాసలు తెలిసినవే. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ నాయకత్వంలో ఏర్పడుతున్న ఈ మహాకూటమికి చంద్రబాబు మేనేజర్‌గా వ్యవహరించడం వేరే విషయం! అయితే స్థానికంగా ఏపీలో మాత్రం ఇది వర్కౌట్ కాదని బాబు వర్గీయులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఈ పొత్తు పట్ల గతంలో వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన ఈ రెండు పార్టీలు ఆ విషయాన్ని గ్రహించాయి. తెలుగుదేశంతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడమే తమ నష్టానికి కారణమంటూ తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ పోస్ట్ మార్టం మీటింగులో చాలామంది తమ అభిప్రాయపడ్డారు.నిజానికి ఎన్నికల ప్రచారంలో ఉండగానే రాహుల్-బాబుల మధ్య ఈ విషయం చర్చకొచ్చింది. ‘ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవడం’ అనే విషయాన్ని మీకే వదిలేస్తున్నానంటూ కాంగ్రెస్ అధినాయకుడు బాబుతో చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఆ తరువాత బాబు పునరాలోచన మొదలైంది. ఇక్కడ పొత్తు పెట్టుకుని తప్పు చేశామంటూ సీనియర్ నాయకులు కూడా అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. కొంతకాలం క్రితం రాహుల్ హైదరాబాదులో మీడియాతో భేటీ అయినపుడు కూడా తమ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో బలహీనంగా వున్నదనే  విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇక పొత్తు విషయమై బాబు మొన్న ఢిల్లీలో రాహుల్‌ను కలిసినపుడు తన పాత వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. ఏపిలో కాంగ్రెస్ మీద ప్రజలింకా కోపంగా ఉన్నారని, అన్యాయంగా విభజన చేసిందన్న ఆగ్రహమే ఇంకా కొనసాగుతోందంటూ చెప్పారు. జాతీయ స్థాయిలో తెలుగుదేశం కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించి మహాకూటమికి మద్దతుగా నిలుస్తుంది తప్ప ఏపీలో మాత్రం పొత్తు కుదరదని చెప్పినట్లు సమాచారం.సో… తెలుగుదేశం ఈసారి ఒంటరి ప్రయాణానికి సిద్ధమైపోయింది. గత ఎన్నికల్లో తెదేపాకు మోదీ ఒకవైపు… పవన్‌కళ్యాణ్ మరోవైపు నిలబడి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆనాడు మోదీకి ఉన్న అనుకూల వాతావరణం, పవన్‌కళ్యాణ్ ప్రచారం రెండూ తోడై… ఆ పార్టీ విజయానికి దోహదం చేశాయి. ఈసారి అటువంటి పరిస్థితి లేకపోగా, అధికారంలో ఉన్న పార్టీకి సంక్రమించే యాంటీ-ఇంకంబెన్సీ అనబడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా తోడవుతుంది. మరోవైపు జగన్ వైఎస్సార్సీపీ – జనసేన పార్టీలు కూడా  పోటీలో ఉండడంతో… ఈ త్రిముఖ పోటీలో తెలుగుదేశానికి క్లిష్ట పరిస్థితి ఎదురుకాక తప్పదు. అంతేకాకుండా కాంగ్రెస్ కూడా ఒక జాతీయ పార్టీగా రంగంలోకి దిగి అన్ని సీట్లకూ పోటీ చేయక తప్పని పరిస్థితి. ఇక బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్థుల్ని దించక తప్పదు. అంటే… కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలన్నీ పోటీ చేస్తే అక్కడ అయిదుగురు అభ్యర్థులు బరిలో వుంటారు. ప్రజా తీర్పు ఏ వైపు ఉన్నప్పటికీ ఓట్లు చీలిపోవడం తధ్యం. దీంతో ఎవరికి నష్టమన్న లెక్కల్ని అందరూ వేసుకోవాల్సిందే. ముఖ్యంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.