ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినన్ని సంస్థలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి దక్కలేదు: మోదీ

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినన్ని సంస్థలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి దక్కలేదు: మోదీ

విజన్‌ను ప్రజలకు వివరించాలి
కుంభకోణాలకు పాల్పడ్డారు
నిరంతరం పనిచేస్తూనే ఉంటాం
ఏపీ మార్పు కోరుకుంటోంది
జాతీయ ప్రాధాన్యమున్న 10 విద్యాసంస్థలను ఏపీలో ప్రారంభించామని.. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినన్ని సంస్థలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికీ దక్కలేదని ప్రధాని మోదీ అన్నారు. నేడు ఆయన కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, విజయనగరం, విశాఖ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడుతూ.. తాము స్థాపించినటువంటి సంస్థలను.. ఏపీలో ఇంతకాలం టీడీపీ, కాంగ్రెస్ ఎందుకు స్థాపించలేదో చెప్పాలన్నారు. ఏపీ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని.. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, విజన్‌ను ఏపీ ప్రజలకు వివరించాలని మోదీ కార్యకర్తలకు సూచించారు. ఏపీలో పాలకులు కుంభకోణాలకు పాల్పడ్డారని మోదీ పేర్కొన్నారు.

నాడు ఎన్టీఆర్ కాంగ్రెస్‌ను దుష్ట కాంగ్రెస్‌గా అభివర్ణిస్తే.. నేడు అధికారంలో ఉన్నవాళ్లు ఆ పార్టీతోనే స్నేహం చేస్తున్నారన్నారు. తాము ఏపీ ఆకాంక్షలను చాలా వరకూ నెరవేర్చామని కానీ రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు. ఏపీ మార్పు కోరుకుంటోందని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోదీ కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిన విషయాన్ని ప్రజలు మరచిపోయారని.. ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా అన్నదమ్ములను విడదీశారన్నారు. బీజేపీ ప్రజల కోసం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.