అయ్యో.. ఎంత ఘోరం శబరిమలకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..

అయ్యో.. ఎంత ఘోరం శబరిమలకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం పుదుకొైట్టె జిల్లా తిరుమయం వద్ద అయ్యప్ప భక్తులతో వెళ్తున్న వ్యాన్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన 11 మంది దుర్మరణంచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఖాజీపేట, మంతూర్, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామాల్లో విషాదం అలుముకున్నది. ఈ నెల 2న ఖాజీపేటకు చెందిన నాగరాజుగౌడ్ (38), మస్కూరి రాజు, జుర్రు మహేశ్ (30), బోయిని కుమార్‌యాదవ్ (28), నరేశ్‌గౌడ్, దొంతి భూమయ్యగౌడ్, రెడ్డిపల్లికి చెందిన నక్క ఆంజనేయలు (38), అంబర్‌పేట కృష్ణగౌడ్ (35), మంతూర్‌కు చెందిన చీరాల శివప్రసాద్ (28), అయ్యన్నగారి శ్యాంగౌడ్ (22), శ్రీశైలం, చిన్నచింతకుంటకు చెందిన ప్రవీణ్‌గౌడ్ (30), జన్ముల సురేశ్ (34), సాయి (22), హత్నూర మండలం మంగాపూర్‌కు చెందిన వెంకటేశ్‌గౌడ్‌లు హైదరాబాద్‌లోని ఓ ట్రావెల్ వ్యాన్ లో బోయినిపల్లికి చెందిన డ్రైవర్ సురేశ్ (25) సహా 16 మంది శబరిమల యాత్రకు బయలుదేరారు.
తిరుగు ప్రయాణంలో రామేశ్వరం వెళ్లివస్తుండగా, పుదుకొైట్టె జిల్లా తిరుమయం వద్ద వీరు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న నాగరాజుగౌడ్, జుర్రు మహేశ్, బోయిన కుమార్‌యాదవ్, అంబర్‌పేట కృష్ణగౌడ్, నక్క ఆంజనేయులు, ప్రవీణ్‌గౌడ్, జన్ముల సురేశ్, అయ్యన్నగారి శ్యాంగౌడ్, చీరాల శివప్రసాద్, సాయి, డ్రైవర్ సురేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నరేశ్‌గౌడ్, దొంతి భూమయ్యగౌడ్, మస్కూరి రాజు, శ్రీశైలం, వెంకటేశ్‌గౌడ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని తిరుమయం దవాఖానకు తరలించారు. కంటైనర్ రాంగ్‌రూట్‌లో ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తిరుమయం దవాఖానలో క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

తమిళనాడుకు సీఐ, తహసీల్దార్
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తమిళనాడులోని పుదుకొైట్టె జిల్లా కలెక్టర్ గణేశ్‌తో మాట్లాడారు. జేసీ నాగేశ్.. హుటాహుటిన నర్సాపూర్‌కు చేరుకొని తహసీల్దార్ భిక్షపతి, సీఐ సైదులును విమానంలో తమిళనాడుకు పంపించారు. వీరివెంట టీఆర్‌ఎస్ నేత మురళీయాదవ్ కూడా వెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పుదుకొైట్టె జిల్లా కలెక్టర్ గణేశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

నర్సాపూర్ మండలంలో విషాదఛాయలు
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి, చిన్నచింతకుంట, ఖాజీపేట, మంతూర్ గ్రామాలకు చెందిన అయ్యప్పస్వాముల మృతితో నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ వద్దకు బాధితులు, బంధువులు, గ్రామస్థులు పెద్దఎత్తున చేరుకొని రోదించడం చూపరులను కంటతడిపెట్టించింది. నాలుగు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నర్సాపూర్ పీఎస్‌కు చేరుకొని బాధిత కుటుంబీకులను పరామర్శించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

రోడ్డుప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రోడ్డు ప్రమాదంలో 11 మంది తెలంగాణ బిడ్డలు చనిపోవడం పట్ల తీవ్ర బాధను వ్యక్తంచేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యసదుపాయాలను అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం
తమిళనాడు ప్రమాదంలో మృతిచెందిన అయ్యప్ప భక్తుల కుటుంబాలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందేలా చూడాలని అధికారులను కోరారు.

పుదుకొైట్టె కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన హరీశ్‌రావు
తమిళనాడులో అయ్యప్ప భక్తుల రోడ్డుప్రమాద ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదం దురదృష్టకరమని, తీవ్ర సంతాపం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అం దేలా చూడాలని పుదుకొైట్టె జిల్లా కలెక్టర్ గణేశ్‌తో వెం టనే ఫోన్‌లో మాట్లాడారు. అలాగే మృతదేహాలు స్వస్థలానికి తరలించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ప్రయాణ సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు సూచించారు.
శబరిమలకు వెళ్లివస్తూ కీసరవాసి మృతి
కీసర: శబరిమలకు వెళ్లివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా కీసరవాసి మృతిచెందిన మృత్యువాతపడ్డాడు. కీసరకు చెందిన మిట్టపల్లి సత్తయ్యగౌడ్ (55) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయిదు రోజుల కిందట నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం నుంచి అయిదుగురు అయ్యప్పస్వాములు, ముగ్గురు సాధారణ భక్తులతో కలిసి సత్తయ్యగౌడ్ ఓ వాహనంలో శబరిమల యాత్రకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా ఆదివారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో నల్లగొండకు ఐదు కిలోమీటర్ల దూరం వీరు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మిట్టపల్లి సత్తయ్యగౌడ్ రెండు చేతులు విరిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలినవారికి గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.