అక్రమార్కులను ప్రజాకోర్టులో శిక్షిస్తాం కోరుకొండ ఏరియా కమిటీ హెచ్చరిక

అక్రమార్కులను ప్రజాకోర్టులో శిక్షిస్తాం కోరుకొండ ఏరియా కమిటీ హెచ్చరిక

మన్యంలో ప్రజల సొమ్మును కాజేస్తున్న అక్రమార్కులను ప్రజాకోర్టులో శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. ఈమేరకు మావోయిస్టు పార్టీ కోరుకొండ కమిటీ పేరిట గురువారం రాత్రి లేఖ విడుదల చేశారు. ఏజెన్సీలోని అన్ని మండలాల్లో, పంచాయతీల్లో ప్రజలకు చెందిన సొమ్మును కొందరు అధికారులు స్వాహా చేస్తున్నారని.. ప్రత్యేక ఆడిట్‌, సోషల్‌ ఆడిట్‌ వంటివి ఉన్నప్పటికీ అక్రమాలు జరగడం దారుణమన్నారు.ప్రధానంగా చింతపల్లి మండలం బలపం పంచాయతీలో 2013నుంచి 2017వరకు వచ్చిన గ్రాంట్‌లను గత ఎంపీడీవో భాగ్యరావు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌, ఏఈఈ జ్యోతిబాబు, స్థానికుడైన గుబలంగి మోహనరావు కుమ్మక్కై లక్షలాదిరూపాయాలు స్వాహా చేశారని మావోయిస్టులు ఆరోపించారు.

ప్రస్తుత ఎంపీడీవో ప్రేమాకరరావు, ఏపీడీ రవీంధ్రనాథ్‌ సైతం గుబలగి మోహనరావుతో కలిసి పంచాయతీల నిధుల్లో అక్రమాలు చేశారని ఆరోపించారు. వీరి అక్రమాలపై ప్రజలకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తే కనీసం దర్యాప్తు చేయలేదని పేర్కొన్నారు. గుబలంగి మోహనారావుతో సంబంధాలు కలిగిన ఏ ఒక్క అధికారిని తాము వదలమని ప్రజాకోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారు. ఏజెన్సీలో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలే అవినీతి అధికారులను తరిమికొట్టాలని మావోయిస్టులు పార్టీ కోరుకోండ ఏరియా కమిటీ పిలుపునిచ్చింది.